తుర్కపల్లి బొల్లారం 190వ డివిజన్‌లో రాజకీయ వేడి..
అభివృద్ధి వర్సెస్ ఉద్యమం.. ఓటర్ల తీర్పు ఎవరికి?.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా, జూన్ 15 మన వార్త: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ) పరిధిలోని 190వ తుర్కపల్లి బొల్లారం డివిజన్ రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. అధికార, ప్రతిపక్ష పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా క్షేత్రస్థాయిలో తమ రాజకీయ వ్యూహాలకు పదును పెడుతుండటంతో డివిజన్‌లో ఎన్నికల సందడి మొదలైంది.
వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాంతంలో ఈసారి ఎన్నికల పోరు కేవలం పార్టీల మధ్య కాకుండా అభివృద్ధి వర్సెస్ ఉద్యమం అనే అంశం చుట్టూ తిరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఒకవైపు గతంలో జరిగిన అభివృద్ధి పనులను కొన్ని రాజకీయ పార్టీలు తమ విజయంగా ప్రజల ముందుకు తీసుకెళ్తుండగా, మరోవైపు తెలంగాణ ఉద్యమ నేపథ్యం కలిగిన నాయకులు ప్రజలతో నిరంతరం మమేకమై పోరాడిన నాయకత్వానికే ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నారు.
గతంలో 133వ డివిజన్ పరిధిలో ఉన్న సమయంలో రోడ్లు, భూగర్భ డ్రైనేజీ, పార్కులు, తాగునీటి సదుపాయాలు, కమ్యూనిటీ మౌలిక వసతుల అభివృద్ధికి పెద్దఎత్తున నిధులు వెచ్చించినట్లు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో అభివృద్ధి అంశాన్ని కొన్ని పార్టీలు ప్రధాన ప్రచార అస్త్రంగా మార్చుకున్నాయి.
అయితే స్థానిక ప్రజలు మాత్రం అభివృద్ధి పనులతో పాటు ప్రజలకు అందుబాటులో ఉండే నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే కనిపించి, అనంతరం ప్రజలకు దూరమయ్యే నాయకులపై అసంతృప్తి వ్యక్తమవుతోంది.
డివిజన్‌లో కొత్తగా పలువురు నాయకులు రాజకీయ రంగప్రవేశం చేస్తుండటంపై కూడా ప్రజలు అప్రమత్తంగా ఉన్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే ఇంటింటికీ తిరిగే "పారాషూట్ నాయకులను" ప్రజలు సులభంగా నమ్మే పరిస్థితి లేదని కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు.
మన వార్త నిర్వహించిన అనధికారిక సర్వేలో ప్రజలు పలు ఆసక్తికర అభిప్రాయాలు వెల్లడించారు.
"ఎన్నికల ముందు కాదు.. ఐదేళ్లు ప్రజల మధ్య ఉండే నాయకుడు కావాలి."
"పార్టీ గుర్తు కంటే ప్రజా సేవకు ప్రాధాన్యత ఇస్తాం."
"అభివృద్ధి చేసిన వారికి గుర్తింపు ఉండాలి. అదే సమయంలో ప్రజల సమస్యలు వినే నాయకుడు కూడా కావాలి."
"డబ్బు ఖర్చు చేసే నాయకుడు కాదు.. సమస్య వచ్చినప్పుడు స్పందించే నాయకుడినే ఎన్నుకుంటాం."
"డ్రైనేజీ, రోడ్లు, వీధి దీపాలు, పారిశుద్ధ్య సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే వారికే మద్దతు ఇస్తాం."
ఇప్పటికే పలువురు ఆశావహులు కార్పొరేటర్ అభ్యర్థులమంటూ ప్రచారం ప్రారంభించారు. కొందరు ఆర్థిక బలాన్ని, మరికొందరు రాజకీయ అనుభవాన్ని, ఇంకొందరు ఉద్యమ చరిత్రను తమ ప్రధాన బలాలుగా ప్రచారం చేసుకుంటున్నారు.
అయితే ఓటర్ల ఆలోచన మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. రాజకీయ హడావుడి, ప్రచార ఆర్భాటం కంటే ప్రజలతో నిరంతరం మమేకమై, సమస్యల పరిష్కారానికి కృషి చేసే నాయకత్వానికే ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలు భావిస్తున్నారు.
ఇప్పుడు అందరి దృష్టి ఒక్క ప్రశ్నపైనే నిలిచింది. 190వ తుర్కపల్లి బొల్లారం డివిజన్‌లో అభివృద్ధి చేసిన నాయకత్వమా..? ఉద్యమ స్ఫూర్తితో ముందుకు వస్తున్న నాయకత్వమా..? లేక కొత్త ప్రత్యామ్నాయ నాయకత్వమా..? చివరకు ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుంటుందన్నది రానున్న రోజుల్లో తేలనుంది.
Medchal -Malkajgiri District
తుర్కపల్లి బొల్లారం 190వ డివిజన్‌లో రాజకీయ వేడి..అభివృద్ధి వర్సెస్ ఉద్యమం.. ఓటర్ల తీర్పు ఎవరికి?.
Quick Summary:
మన వార్త ప్రతినిధి :అంతోని